Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కంకణభట్టార్ గిరిధర్ భట్టాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనంను వైభవంగా నిర్వహించారు. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధం లోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణ దారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరణ చేశారు. చివరగా పుష్కరణి లోకి చక్రతాళ్వార్ తీసుకుని వెళ్లి మూడు సార్లు నీట ముంచారు. ధ్వజావరోహణంతో ముగిసిన ఉత్సవాలు: మంగళవారం సాయంత్రం 5.30 నుండి 7 గంటల మధ్యన జరిగిన ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి.
Admin
Famous TV