Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఏప్రిల్ 14వ తేదీన విశ్వవిద్యాలయ స్థాపన దినోత్సవం, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఉపాధ్యక్షులు ఆచార్య వి.ఉమా గారు,రిజిస్ట్రార్ ఆచార్య రజనీ గారు పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. ఉమా గారు మాట్లాడుతూ 1983 ఏప్రిల్ 14న ఉగాది, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంచి శకునంగా భావించి రామారావు గారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ శంకుస్థాపన జరిపారని తెలిపారు. స్రీలు చదువుకుంటే కుటుంబాన్నే కాదు సమాజాన్ని కూడా మార్చగలరని, స్త్రీల అభివృద్ధిని కాంక్షించి వీరు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రజినీ గారు మాట్లాడుతూ మహిళా యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అందుకు వీసీ గారి కృషి ఉందని పేర్కొన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు కారణంగానే ఇంతటి యూనివర్సిటీని నెలకొల్పుకోగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోధన, బోధనేతర సిబ్బంది నందమూరి తారక రామారావు గారిని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ స్త్రీల ఆర్థిక,స్వేచ్ఛ, స్వాతంత్రాల, కోసం వారు ఎంతగా తపించారో వారి మాటలలో తెలియజేశారు. తదనంతరం సావేరి సెమినార్ హాల్లో ఎన్.ఎస్.ఎస్. బ్యూరో తరపున అంబేద్కర్ జయంతి, విశ్వవిద్యాలయ స్థాపన దినోత్సవానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ &అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ ఆచార్య ఐ.వి.లలిత కుమారి గారు వ్యవహరించారు. వారు మాట్లాడుతూ మనమందరం ఇక్కడ చదువుకుంటున్నామంటే దానికి కారణం శ్రీ నందమూరి తారక రామారావు గారు చేసిన కృషే అని తెలిపారు. అందరికీ ఆస్తిలోనూ,అంతస్తుల్లోను సమానత్వం కావాలని దానికోసం అంబేద్కర్ గారు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎమ్. గురునాథ్ (మూడవ అడిషనల్ జిల్లా సెషన్ జడ్జ్) గారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చే నాటికి మనలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో రాజ్యాంగాన్ని మన దేశానికి కానుకగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు అందజేశారని తెలిపారు. 39(A) ఆర్థికంగా సాంస్కృతికంగా రాజకీయంగా స్వేచ్ఛను కలిగి ఉండేలా చేశారు. విద్యతో ముందడుగు వేస్తూ మన ఆశయాలను సాధించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జి.అర్చన (నాల్గవ అడిషనల్ జిల్లా జడ్జ్, SC&STs, (POA) చట్టం 1989 కింద కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి) గారు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది కేవలం దళితులకు మాత్రమే కాదు, దేశంలోని పౌరులందరికీ సంబంధించిందని పేర్కొన్నారు. అన్ని దేశాల రాజ్యాంగాల్లోని ప్రముఖ అంశాలను తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. రాజ్యాంగాన్ని న్యూస్ పేపర్ లోనో,సోషల్ మీడియాల్లోనో కాకుండా ఒకసారి రాజ్యాంగాన్ని చదవమని చెప్పారు.అప్పుడే దాని గొప్పతనం తెలుస్తుందని పేర్కొన్నారు. అందులో మన హక్కులు,బాధ్యతలు గురించి బాగా పేర్కొన్నారని చెప్పారు.కొన్ని సంవత్సరాలుగా వీరిని తలుచుకుంటున్నామంటే దానికి కారణం వారు సమాజానికి చేసిన సేవ అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య ఉమా గారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి, మహిళా యూనివర్సిటీ ఫౌండేషన్ డే రెండు ఒకేరోజు రావడం చాలా సంతోషమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు మాటలతో సరిపెట్టే మనిషి కాదని వారు నమ్మిన సిద్ధాంతాన్ని పూర్తిచేసే వరకు విశ్రమించరని తెలియజేశారు. అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి పోరాటం చేస్తూ వచ్చారని తెలిపారు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. తన తల్లిదండ్రుల నుంచి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నారని తెలిపారు. చందమామలో తన తల్లిని చూసుకునేవారని, వీరు కేవలం దళితుల హక్కుల కోసమే కాక స్త్రీ విద్య,బాల్యవివాహాల కోసం చాలా పోరాటం చేశారని తెలిపారు. వీరి తల్లి మరణించాక వీరి భార్య రమాదేవి వీరికి అండగా నిలిచారని, వారి సిద్ధాంతాలకు గౌరవం ఇచ్చారని తెలిపారు.నేను నా ప్రజలకు కత్తిని ఇవ్వలేదు ఓటు హక్కును ఇచ్చాను. దానిని నమ్ముకుని ప్రయోజకులవుతారో లేదా అమ్ముకొని కష్టపడతారో మీ ఇష్టం అని వారు చెప్పిన మాటను మరొకసారి గుర్తుచేశారు.స్త్రీ సాధికారత చాలా ముఖ్యమైందని సమాజాభివృద్ధి స్త్రీల అభివృద్ధిపైనే ఆధారపడుతుందని చెప్పారు. మన బాధ్యతలు మనం నిర్వర్తించినప్పుడే మనం మన హక్కులు పొందగలుగుతామని తెలియజేశారు. వారి మార్గంలో నడుస్తూ వాటిలో కొన్నింటినైనా అలవర్చుకోమని విద్యార్థినులకు తెలిపారు. మహిళలు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆశించి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు.ఇక్కడ చదువుకున్న విద్యార్థినిలు గొప్ప గొప్ప పదవులు అలంకరించారని దాని వెనుక రామారావు గారి కృషి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ రజిని గారు మాట్లాడుతూ ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అంబేద్కర్ గారని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ కావాలని వీరు కృషి చేశారని తెలిపారు. మన ఆలోచనలో మార్పు రావాలని ఆ మార్పు అభివృద్ధిని సాధించే విధంగా ఉండాలని పేర్కొన్నారు. స్త్రీ విద్య కోసం వీరు చాలా పాటు పడ్డారని మరొకసారి గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు గారు ఎలాగైనా స్త్రీలు విద్యను పొందాలి, దాని ద్వారా విద్యార్థినిలు అభివృద్ధి వైపు ముందడుగు వేయాలని ఈ విశ్వవిద్యాలయంను స్థాపించారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సునీత ఆహ్వానం పలకగా వజిహాభాను వక్తను పరిచయం చేశారు. రుక్మిణి వందన సమర్పణ తెలిపారు. ఇందులో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని సభను విజయవంతం చేశారు.
Admin
Famous TV